Friday 15 July 2016

ఓరి దేవుడోయ్,ఆయన గారు కదలాలంటే ఇంత గుక్కపట్టి ఏడవాలా?ఇంత సుదీర్ఘంగా యేడ్చే ఓపిక మాకు లేదయ్యోయ్ - గజేంద్ర మోక్షణా!

     అయ్యా,గజేంద్రుడు మకరికి చిక్కి కాస్సేపు చీరులీడర్లుగా ఘీంకరిస్తున్న తన రాణులకి పోజులు గొడుతూ అట్లా ఇట్లా పోట్లాడేసి  ఓపిక తగ్గి కొంచెం డేంజరపాయం బుర్రలో ఎర్రలైటులాగ వెలిగిందో లేదో తెయ్యిమని "లావొక్కింతయు లేదు---" అని పద్యం యెత్తుకోగానే రయ్యిమని వచ్చి రక్షించేశాడనుకుని ఏ కొంచెం కష్తమొచ్చినా ఆ ఒక్క పద్యమూ చదివేసి "ఇంత భక్తిగా చదివినా ఇంకా రావట్లేదు,మనిషిని నా తక్కువంటి?ఆఫ్టరాల్ ఏనుగు ఎక్కువేంటి?ఇందులో ఏదో కిరికిరి ఉంది!ఏమయినా ఆయనకి పక్షపాతం ఎక్కువ" అని పరిపరి విధాల తిట్టుకుంటాం గానీ గజేంద్రుడు చాలా సుదీర్ఘంగా ఏడ్చాడండి పాపం!మకరితో పోట్లాడిన కాలం లెక్క ప్రకారం యుగాలు గడిచాయని చెప్తారు గానీ పోతన గారి పద్యాల లెక్క ప్రకారం, ఇదుగో:

ఏ రూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.

అని ఈ రకమైన విచికిత్సతో ఇక్కడ నుంచి మొదలు పెట్టి

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; 
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

యోగాగ్ని దగ్దకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.

కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?

కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ; 
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు? 
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ; 
బడిన సాధుల కడ్డపడెడువాఁడు? 
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ; 
జూచువారలఁ గృపఁ జూచువాఁడు? 
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల; 
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?

అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?

విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్; 
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్; 
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

విను దఁట జీవుల మాటలు
చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ!

ఓ! కమలాప్త! యో! వరద! యో! ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో! శరణాగతామరా
నోకహ! యో! మునీశ్వర మనోహర! యో! విమలప్రభావ! రా
వే కరుణింపవే తలఁపవే శరణార్థిని నన్నుగావవే.

     ఇక్కడి వరకు ఆపకుండా రకరకాల అర్ధాలతో దఫదఫాలుగా తీరు మారుస్తూ ఆఖరికి సంపూర్ణ శరణాగతికి దిగిపోయి గుక్కపట్టి యేడ్చాడండి,మనమెప్పుడయినా ఇంత సుదీర్ఘంగా యేడ్చామా!కాకిపిల్ల కాక్కి ముద్దన్నట్టు మన కొంచెపు ఏడుపు మనకి ఎక్కువగా కనబడుతుంది గానీ ఆయనకి మనమొక్కరమేనా?అనంతకోటి విశ్వాల్లో ఏనుగే కాదు ఎలకపిల్ల ఏడ్చినా ఆయనే వెళ్ళాలి!సరిగ్గా మనం బుడిబుడి యేడుపుగా ఒక కూనిరాగం తీసి అదే గొప్ప అనుకునే టయానికి ఇంకెక్కడో ఇలాంటి యేడుపు యేడిస్తే ఎటు వెళ్ళటం న్యాయం?మీరే చెప్పండి!

     ఇంత పొడుగ్గా పిల్చినా రావట్లేదంటే నువ్వున్నావనే అనుమానంగా ఉంది స్వామీ అని కూడా అఘోరించి అదీ చాలక ఆఖరికి "ఓ!యో!కుయ్యో!!మొర్రో!!" మని అంగలార్చినాక అప్పుడు

విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడఁ దలంచె.

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

     "హమ్మయ్య,కదిలాడు" అని గజేంద్రుడి మీద సెంటిమెంటుతో అల్లాడిపోతున్న మనం వూపిరి పీల్చుకునే లోపు ఆయన కదలడం,లేవడం,పరిగెత్తడం,వైకుఠం దాటి పోవడం అన్నీ జరిగిపోయాయండోయ్!

తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీ జనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్? 
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం
గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.

అని వితర్కించుచు.

తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్లబంధంబుతో; 
శాటీముక్త కుచంబుతో; నదృఢచంచత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాలగ్నోత్తరీయంబుతోఁ; 
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.

అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.

     పాపం పేరు గల పెద్ద ఇల్లాలు శ్రీదేవి కొచ్చిపడిన కష్టం చూడాలి!ఆటగా పట్టుకున్న పైటకొంగు కూడా వదలట్లేదు!చూసి వర్ణిస్తున్నది భక్తుడు గాబట్టి సరిపోయింది గానీ, అదే పెరుమాళ్ మురుగన్ లాంటివాడు చూసి ఉంటే?

     ఆవిడ పిచ్చిగానీ, కళ్ళముందు పాయింట్ బ్లాంక్ రేంజిలో తొండమెత్తి మొత్తుకుంటున్న గజేంద్రుడు కనబడుతుంటే ఈవిడ కొచ్చెన్లు ఆయన చెవిని చేరతాయా?

నిటలాలకము లంట నివుర జుంజుమ్మని; 
ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు; 
నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన చేరి; 
యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు; 
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం; 
దాకినీ పాఠీనలోక మెసఁగు; 
మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ; 
శపాలతలు మింట సరణిఁ గట్టు;

శంపలను జయింపఁ జక్రవాకంబులుఁ
గుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు; 
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె
జలదవర్ణు వెనుకఁ జనెడునపుడు.

వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణుఁ యోగీంద్ర హృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృందప్రాభవాలంకరి
ష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.

ఇట్లు పొడగని.

చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
ఖ నినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర
న్నన యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.

     రావడం ఇంత అల్లాండం బెల్లాండం భూనభోంతరాళాలు దద్దరిల్లిపోయేలా వచ్చాడు గానీ క్లైమాక్సు మాత్రం సింపులుగా తేల్చేశాడు,మనసెరిగిన సుదర్శనం కనుసైగతోనే మకరి తల నరికింది,కరి బతికింది,మకరి హరిని చేరింది!


జై శ్రీ గజేంద్రవరద గోవిందోహారి!!!

19 comments:

  1. ఇంతకీ మకరి చేసిన పాపమేమి స్వామి???

    ReplyDelete


  2. కదలని మనంబు నందున
    వదులక చెదురక కుదురుగ వరదుని గొల్వన్
    మది సదనము నతనిదియై
    కదలని వరదుడు జిలేబి కదలిక గాంచున్

    జిలేబి

    ReplyDelete
  3. అలయక సొలయక వేసట
    నొలయక గరి మకరితోడ నుద్దండత రా
    త్రులు సంధ్యలుదివసంబులు
    సలిపెంబోరొక్కవేయి సంవత్సరముల్..
    నిజమే.. ఇదమిద్దంగా ఎన్నాళ్ళు పోరాడిందో చెప్పలేంగానే పైపద్యంలో చెప్పినట్లు వేయిసంవత్సరాలు అనుకోవచ్చు. వేయి అంటే మనలెక్కప్రకారం 1000 కాకుండా అనంతమనే అర్థమూ తీసుకోవచ్చు.
    ఏది ఏమైనా భగవంతుణ్ణి రప్పించుకోవాలంటే సర్వస్య శరణాగతి తప్పదని రూఢి అయిందిగా. మనమూ అలా చేయగలిగితే సరి!

    ReplyDelete
  4. భాగవతమ్ము నాపరమ భాగవతోత్తము డన్ని ఘట్టముల్
    తా గనులార గన్నటుల తన్మయుడై రచియించి, చక్రినీ
    లాగున కళ్ళ ముందు కదిలాడగ జేసి తరించె, మీరునూ
    ఈగతి మీవిథానమున నింపుగ వ్యాఖ్యలు వ్రాసిరెంతయున్

    మరి,గజేంద్రమోక్షము వలె మహితము, శుభ
    కరము రుక్మిణీ కళ్యాణ ఘట్ఠమున్ను ,
    పోతనామాత్యు ప్రతిభకు జోతలిడగ
    వ్రాయుదురు గాక, యెంతయు ప్రతిభ గదుర .

    ReplyDelete
  5. మకరి గోల పట్టించుకోరేమి?

    దాని ఫీలింగ్స్ మీద కూడ పద్యాలు వదులుదురూ

    ReplyDelete
    Replies

    1. బడుగు వాళ్ళ ఫీలింగ్స్ గురించి పద్యాలెవరు‌ రాస్తారండి బాబు ;

      గిట్టు బాట్లు ఉన్న చోటే పద్యాలు గిట్టును‌:)


      జిలేబి

      Delete
    2. జంతువులలో బడుగు,బలహీన,తాడిత, పీడిత వర్గాల సిద్దాంతాలు ఉంటాయా? ఒక వేళ ఉన్నాయనుకొంటే ఇక్కడా ఏనుగు కాలును పట్టి పీడీంచింది మకరి (నీళ్ళలో మొసలి ఎంతో బలమైనది) విష్ణువు పీడితుల వైపే ఉన్నాడు.

      సిల్లి వ్యాఖ్యలు రాస్తూ జిలేబి, విలువను కోల్పోకు.

      Delete

    3. శ్రీరాం జీ

      కడాన ఎవరి మీద దెబ్బ పడతాది ?

      బడుగు వారి మీదేగా ?

      అట్లా మకరి బడుగు వాడు :)

      జిలేబి

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. జిలేబీయా మాజాకా!
      ఒకే జవాబుతో ఇద్దరికీ మొట్టికాయ లేసింది - కిలేడీ:-)

      సీ||సరిసరి నీపని సరి,నీదగు మని నీ
      దని,సరిసరిగ పదమని సాని

      పలికె మకరిని దా బడుగ్గుదని కరిగ
      రిమ గరిమయె గాదని,హరిదే గ

      రిమయని, సారి సారి దమమని సనాత
      న దమమని దమమె నిగమ మాగ

      మ గరిమగ విలిచె!మరి,హరి సిరి యుర
      మున గల హరియును మురిసె, మాధు

      తే||రీ కలాపి జిలేబి కరిమకరిమగని
      హరిగ సరిగగని వలదు మదమని హరి
      మాయ నిదపమగరిస మారి గాగ!
      హరి సనాతనుడని ఎంచి హరిని గనరె?

      Delete

    6. హరి నస నాథుడే :)

      జిలేబి

      Delete
    7. జిలేబి నా ఝండూ బాంబా? అనాల్సింది. ఆ అరసున్నాలతో పద్యాలు కనపడటం నేను పారిపోతాను :)

      Delete
    8. ఆవిడ పజ్జ్యాలు నాకూ భయంగానే ఉండి హడెలెత్తిస్తున్నాయి గానీ,ఇక్కడ జిలేబీ కామెంటుకి అర్ధం ఇది:శ్రీమహావిష్నువు రంగంలోకి దిగనంతవరకే మకరి ప్రతాపం చూపించింద్.ఆయన పరాక్రమంతో పోలిస్తే మకరి బడుగు జీవియే!ఆ కధలోని అసలు రహస్యం కూడా అదే,మీరు నమ్మరు గానీ.నేను ఎప్పటినుంచో ఇక్కడ ఉన్నాను అనే కారణంతో ఆ మడుగు మీద తనకి హక్కున్నట్టు ఏనుగుని పట్టింది.తన మడుగు వరకు తన బలిమిని చూసుకుంది గానీ అటువైపు వాణ్ణి రక్షించడానికి నాకన్నా బలవంతుడు ఎవడైనా వస్తే ఏమవుతుంది అన్నది ఆలోచించుకోలేదు.కరి,మకరి - ఈ రెంటిలో కరి బలం తక్కువ గనక యేడ్చింది!మకరి,హరి - ఈ ఇద్దరిలో మకరి బలం తక్కువ గనక చచ్చింది!బలంలో ఉన్న మూడు అంతరువులు ఇక్కడ కనబడుతున్నారు,ఆలోచించండి.మకరి తనని పట్టేవరకు కరి సరస్సుని మొత్తం ఆటాడేసుకుంది,మకరి తనకి తిక్క రేగగానే కరిని ఆటాడేసుకుంది,హరి తన భక్తుడు "కుయ్యో"మనగానే మకరిని ఆటాడేసుకున్నాడు.

      కొందరు ఏదీ పూర్తిగా విప్పి చెప్పరు.మన సొంత కష్టం మనం పడాలి:-)

      Delete


    9. హరి బాబు గారు

      నమో నమః !

      ఆహా జిలేబి జీవితం ధన్యమయ్యె !

      అంతంత పొడుగూతా పద్యాల్రాస్తే శుభ్రం గా జనాలు అర్థం కాలే అనేసారు :)

      రెండు పదాలున్న ఒక చిన్ని వాక్యం వెనుక ఎంత పెద్ద వేదాంతాన్నే అర్థం చేసుకుని‌ హరిబాబు గారు వ్యాఖ్యానం సాగించారు !

      నేను చెబ్తున్నాగా అర్థం చేసుకునే వాళ్ళున్నారండీ :)
      ఏమంటే ఎవరూ హరిబాబు గారిలా మనసు పెట్టీ చదవటం లే :) అదన్న మాట కైఫీయతు :)

      హరిబాబు గారి మీద కరుణశ్రీ ప్రవచనాల కి ఇంత పవరున్న దన్న మాట :)

      నమో నమః మామీ జిలేబి నమో నమః :)

      చీర్స్
      జిలేబి

      Delete
    10. మోడర్న్ ఆర్ట్ ను చూసిన వారికి అర్థంకాకపోతే దాని ఈ భావంతో చూడాలి, ఆ భావంతో చూడాలి అని చెప్పేవారిలా, మీరు రాసిన రెండు లైన్లు, నాలుగు ముక్కలకి హరిబాబు మీకు కూడా తెలియని భావాలను ఆపదిస్తూ ఆయనకు తెలిసిన వివరాలతో సుధీర్ఘ వివరణ ఇచ్చాడు.

      జిలేబి ఉదయం నుంచి సాయత్రం వరకు ఈ అర్థంకాని అరసున్నా పద్యాలు రాసే బదులు, ఇంట్లో పూర్తి సున్నా ఆకరంతో ఉండే చక్కిలాలు, మురుకులు చుడితే ఉపయోగం ఉంట్టుంది. అవి తాయారు చేసి చెప్పండి, హరిబాబు వీలైతే నేను వచ్చి తినిపెడతాము :)

      Delete
    11. తంపులు పెడుతూ తిట్లు తినే జిలేబీని వెనకేసుకొచ్చి నేను బావుకునేది ఏమి ఉంటుంది?
      నారదుణ్ణి తల్చుకుంటూ జిలేబీ పెటే తంపుల్లో ఉన్న తమాషా ఏమిటో తెలుసునా మీకు!

      Delete
  6. innosateగారూ.. ఇదే ప్రశ్న ని మీ ఒంటిపై ఒద్దికగా కూర్చుని తనపని తాను చేసుకుపోతున్న బుజ్జి మలేరియా దోమని దెబ్బవేసేముందు సంధించండి. ఆ దోమచేసిన పాపమేమిటా అని! అమ్మా జిలేబీ మీరు కూడా. మునిసిపాలిటీ చెత్తపై ముచ్చటగా ఆడుకుని ఆకలితో మీ జిలేబీలపై వాలబోతున్న ఈగలని తోలకండి. అవి చేసిన పాపమేమిటో తెలుసుకోకుండా తోలారో మీ ఆయనపై ఒట్టే!"

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...